కనుదోయి గాఢ సుషుప్తిలోకి జారిపోయినపుడు
మనోనేత్రం పై ఆవిష్కరించబడ్తాయి స్వప్నాలు
రెక్కలు విప్పిన రెప్పల అంచులు
కొలుస్తాయి నింగి గతుల కొలతలు
శిఖరాలు ఎక్కుతుంటాను....
తెలియని వలయాలకు చిక్కుతుంటాను....
లక్ష్యం ఎప్పుడూ దూరమే
గమనంలో కేరింతలు కొడుతుంటాను....
నీ పెత్తనం సాగదంటూ ఎదురుతిరుగుతాయి ఇష్టాలు
బిత్తరపోయిన నన్ను చూసి వెక్కిరిస్తాయి
ఒక్కోసారి అమ్రుత భాండాన్ని చేతికందిస్తాయి
ఒక్కోసారి విసిరికొట్టేస్తాయి
ప్రియుడై ముంగురులు సవరిస్తాయి
ఎండమవులై త్రుష్ణను పెంచేస్తాయి
ఒక్కోసారి నీరై నిప్పును ఆర్పేస్తాయి
ఒక్కోసారి నిప్పుల కుంపటిలోకి తోసేస్తాయి
ఉదయానికి ప్రశ్నలెన్నో వదిలివెళ్తాయి
నిశిరాత్రి కన్నుకొట్టి మళ్ళీ పిలుస్తాయి
మెదడంతా ఝల్లుమనిపించే మెరుపుతీగలు నా స్వప్నాలు
తపోదీక్షకు మెచ్చి దేవుడిచ్చిన వరాలు నా స్వప్నాలు
జిలుగు మేను వర్ణాలు
పన్నీటి కొలను స్నానాలు
అంతశ్చేతన వెలిగించిన మోహాలు
హిమపాతం సొబగులు అద్దిన మంచు పుష్పాలు
రేయంతా జల్లుగా కురిసే రాగాల చినుకులు నా స్వప్నాలు
ప్రభాతపు కెరటంతో కనుమరుగయ్యె ద్రుశ్యాలు నా స్వప్నాలు
No comments:
Post a Comment